అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-1
సంపుటము: 1-220
రేకు: 36-1
సంపుటము: 1-220
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| ఏడ వలపేడ మచ్చి కేడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలా | ॥ఏడ॥ |
| తొలుకారు మెఱుపులు తోచి పోవుఁ గాక నెలకొని మింట నవి నిలిచీనా పొలఁతుల వలపులు పొలసిపోవుఁ గాక కలకాలం బవి కడతేరీనా | ॥ఏడ॥ |
| యెండమావులు చూడ నేరులై పారుఁ గాక అండకుఁ బోవ దాహ మణఁగీనా నిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడ వుండినట్టే వుండుఁ గాక వూఁతయ్యీనా | ॥ఏడ॥ |
| కలలోని సిరులెల్ల కనుకూర్కులే కాక మెలఁకువఁ జూడ నవి మెరసీనా అలివేణులమేలు ఆసపాటేకాక తలఁపు వేంకటపతిఁ దగిలీనా | ॥ఏడ॥ |


