Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-2
సంపుటము: 1-221
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
తామసపు బుద్ధి కంతలు దూరవలసె
॥ఏమి॥
తెగి దురాపేక్షఁ బడ తివియ గతిలేదుగన
పగగొన్న వగల కూపములఁ బడవలసె
తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
మగుడఁబడి భవముతో మల్లాడవలసె
॥ఏమి॥
పాపకర్మములఁ జంపఁగ శక్తిలేదుగన
కోపబుద్ధులచేత కొరమాలవలసె
రూపములఁ బొడగాంచి రోయఁ దరిలేదుగన
తాపములచేఁ [1]బొరలి తగులుగావలసె
॥ఏమి॥
తిరువేంకటాచలాధిపుఁ గొలువలేదుగన
గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె
॥ఏమి॥

[1] ‘బొరల’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము