అధ్యాత్మ సంకీర్తన
రేకు: 37-1
సంపుటము: 1-227
రేకు: 37-1
సంపుటము: 1-227
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| [1]అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము- లందు [2]వెలుగొందీ ప్రభ మీరఁగాను | ॥అదె॥ |
| తగ నూటయిరువైయెనిమిది తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన [3]దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందఁగాను మిగుల నున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్యతపసులున్న గృహములును వొగి [4]నొరగుఁబెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు దిగువ తిరుపతి గడవఁగాను | ॥అదె॥ |
| పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి చెదర కేవంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవారగాను | ॥అదె॥ |
| యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద- యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద అక్కజంబైన పల్లవరాయని మటము అలయేట్లపేడ గడవ\న్ చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద- నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు అంతంతఁ గానరాఁగాను | ॥అదె॥ |
| బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును పొందైన నానావిధంబుల వనంబులును నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల- నీడలను నిలిచి నిలిచి గగనంబు దాఁకి శృంగారరసభరితమై కనకమయమైన గోపురములనుఁ జెలువొంది జగతీధరుని దివ్యసంపదలు గల నగరు సరుగననుఁ గానరాఁగాను | ॥అదె॥ |
| ప్రాకటంబైన పాపవినాశనము[5]లోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతోయములు సోఁకిన భవము- లంతంత వీఁడి పారఁగను యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును- లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో యేకమై తిరువేంకటాద్రీశుఁ డాదరిని యేప్రొద్దు విహరించఁగాను | ॥అదె॥ |
[1] ఇది పెద్దపాట. రెండేసి పంక్తులొకపాదముగ, చరణమున కెనిమిది పంక్తులుగ గుర్తించుకొనవలెను.
[2] ‘వెలుగొంది’ పూ.ము.పా.
[3] ‘దేశాంత్రులు’ వ్యావహారికప్రీతి కిది తార్కాణ.
[4] ఒరగుఁబెరుమాళ్ళు = పండుకొన్న గోవిందరాజస్వామి కావచ్చు.
[5] ‘లోన’ కావచ్చు.


