Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 37-3
సంపుటము: 1-229
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
తనవారలు పెరవారలుఁ దాననియెడివాఁ డెవ్వఁడు
తనుగుణముల దిగవిడిచిన ధన్యుం డాతఁడె పో
॥తన॥
తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన
విగత[1]భయుం డతఁ డెవ్వఁడు [2]వీరుం డెవ్వఁడొకో
పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి
జగదేకప్రీతుండగు చతురుం డాతఁడెపో
॥తన॥
యేచిన పరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన
[3]ధీచతురుం డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకో
చూచిన మోహపుఁ జూపులఁ జురుచూండ్ల కెడమియ్యని
[4]రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో
॥తన॥
చావుకు సరియగు ద్రవ్యవిచారపు తగులులఁ బాసిన
పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో
శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన
దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో
॥తన॥

[1] ‘భయుఁడ’.

[2] ‘వీరుఁడె’ రేకు.

[3] ఈ పాదమంతటా రేకులో డుఞ్‌స్థానికమైన సున్నల స్థానములో అరసున్నలే. అరసున్నలు అంతటా ఒక్కటే.

[4] ‘రాచరిక’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము