అధ్యాత్మ సంకీర్తన
రేకు: 38-5
సంపుటము: 1-235
రేకు: 38-5
సంపుటము: 1-235
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి- కుఱుచబుద్ధుల నెట్టు గూడుదునయ్య | ॥వెఱతు॥ |
| దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు ద్రోహిగాక నేఁడు దొరయట ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే సాహసమున నెట్టు చాలుదునయ్య | ॥వెఱతు॥ |
| తోడఁబుట్టినవాని తొడరి చంపెడువాఁడు చూడ దుష్టుఁడుగాక సుకృతియట పాడైన యిటువంటి పాపబుద్ధులు సేసి నీడ నిలువ నెట్టు నేరుతునయ్య | ॥వెఱతు॥ |
| కొడుకు నున్నతమతిఁ గోరి చంపెడువాఁడు కడుఁబాతకుఁడు గాక ఘనుఁడట కడలేని యిటువంటి కలుషవ్రిత్తికి నాత్మ వొడఁబరపఁగ నెట్లోపుదునయ్య | ॥వెఱతు॥ |
| తల్లిఁ జంపెడువాఁడు తలఁప దుష్టుఁడుగాక యెల్లవారల కెల్ల నెక్కుడట కల్లరియనుచు లోకము రోయుపని యిది చెల్లఁ బో నే నేమి సేయుదునయ్య | ॥వెఱతు॥ |
| యింటివేలుపు వేంకటేశ్వరుఁ దన వెంట- వెంటఁ దిప్పెడువాఁడు విభుఁడట దంటనై యాతని దాసానుదాసినై[1] వొంటినుండెద నేమి నొల్లనోయయ్య | ॥వెఱతు॥ |
[1] ‘దాసుడై’ కావచ్చు.


