Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 38-6
సంపుటము: 1-236
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
ఏమి ఫలము దా నిన్నియునుఁ దెలిసినను
సాము సేసిన ఫలము జయశీలుఁ డౌట గాక
॥ఏమి॥
తాను గలిగిన ఫలము దయ సేయఁగలుగుట
మేను గలిగిన ఫలము మేలెల్ల గనుట
మానుషముగల ఫలము మంచివాఁడౌట తనుఁ
దానె తెలిసిన ఫలము తత్వపరుఁడౌట గాక
॥ఏమి॥
పదిలమగు కులము గల ఫలము తాఁ జదువుట
చదివిన ఫలం బర్థసారంబు గనుట
పొదలి శాస్త్రార్థంబు పొడగన్న ఫలము మతి[1]
దలఁకకిటు వేంకటేశు దాసుఁడౌట గాక
॥ఏమి॥

[1] ‘మ-తిదలఁకకిటు’ పూ.ము.పా. ప్రాస కుదిరినది. యతిభంగము. ఇపుడు అచ్చయినది రేకుపాఠము. ప్రాసభంగము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము