అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-1
సంపుటము: 1-237
రేకు: 39-1
సంపుటము: 1-237
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| కొనరో కొనరో మీరు కూరిమిమందు వునికి మనికి కెల్ల నొక్కటే మందు | ॥కొనరో॥ |
| ధ్రువుఁడు గొనిన మందు తొల్లియుఁ బ్రహ్లాదుఁడు చవిగాఁ గొనిన మందు చల్లని మందు భవరోగములు వీడి పారఁగఁ బెద్దలు మున్ను జవకట్టికొనిన నిచ్చలమైన మందు | ॥కొనరో॥ |
| నిలచి నారదుఁడు గొనిన మందు జనకుఁడు గెలుపుతోఁ గొని బ్రదికిన యామందు మొలచి నాలుగుయుగముల రాజులు ఘనులు కలకాలము గొని కడగన్న మందు | ॥కొనరో॥ |
| అజునకుఁ బరమాయువై [1]యొసగిన మందు నిజమై లోకములెల్ల నిండిన మందు త్రిజగములు నెఱఁగ తిరువేంకటాద్రిపై ధ్వజమెత్తెఁ గోనేటిదరినున్న మందు | ॥కొనరో॥ |
[1] ‘యెసగిన’ కావచ్చు.


