అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-3
సంపుటము: 1-239
రేకు: 39-3
సంపుటము: 1-239
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కటకటా యిటుచేసెఁ గర్మబాధ యెటువంటివారికిని నెడయ దీబాధ | ॥కటకటా॥ |
| దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధ తనుపోషణములు కందర్పబాధ మనసుశాంతికి సదా మమకారముల బాధ తనివోని కోర్కులకు దైవగతిబాధ | ॥కటకటా॥ |
| వెడయాస చూపులకు వేడుకలచే బాధ కడువేడ్కలకు వియోగముల బాధ తొడవైన యెఱుకలకు దురితబుద్ధుల బాధ జడియుఁ బరచింతలకు సంసారబాధ | ॥కటకటా॥ |
| అరిది నిశ్చయమతికి ననుమానముల బాధ సరిలేని జీవులకు జన్మబాధ తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు వెరపుచేతనె కాని వీడ దీబాధ | ॥కటకటా॥ |


