Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-4
సంపుటము: 1-240
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ముచ్చుఁ గన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు
తెచ్చిన సంబళ మెల్లఁ దీరుఁబో లోలోనె
॥ముచ్చు॥
దప్పము చెడినవాని తరుణి కాఁగిటఁ జేరి
అప్పటప్పటికి నుస్సు రనినయట్టు
వొప్పయిన హరిభక్తి వొల్లనివాని యింటి
కుప్పలైన సంపదలు కుళ్లుఁబో లోలోనె
॥ముచ్చు॥
ఆఁకలి చెడినవాని అన్నము కంచములోన
వోఁకిలింపుచు నేల నొలికినట్టు
తేఁకువైన హరిభక్తితెరువు గాననివాని
వేఁకపు సిరులు కొంపవెళ్లుఁబో లోలోనె
॥ముచ్చు॥
వొడలు మాసినవాని వొనరుఁ జుట్టములెల్ల
బడిబడినే వుండి పాసినయట్టు
యెడయక తిరువేంకటేశుఁ దలఁచనివాని
అడరుబుద్ధులు పగలౌఁబో లోలోననె
॥ముచ్చు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము