Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 40-1
సంపుటము: 1-243
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
నిగమనిగమాంతవర్ణిత మనోహరరూప
నగరాజధరుఁడ శ్రీనారాయణా
॥నిగమ॥
దీపించు వైరాగ్యదివ్యసౌఖ్యం బియ్య-
నోపక కదా నన్ను నొడఁబరుపుచు
పైపైనె సంసారబంధములఁ గట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా
॥నిగమ॥
చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ-
లేక కా నీవు బహులీల నన్ను
కాకు సేసెదవు బహుకర్మములఁ బడువారు
నా కొలఁదివారలా నారాయణా
॥నిగమ॥
వివిధనిర్బంధముల వెడలఁద్రోయక నన్ను
భవసాగరములఁ దడఁబడఁ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీనారాయణా
॥నిగమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము