అధ్యాత్మ సంకీర్తన
రేకు: 40-6
సంపుటము: 1-248
రేకు: 40-6
సంపుటము: 1-248
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| సొరిది సంసారంబు సుఖమా యిందరికి వెరవెఱంగక వగల వేఁగేరు గాక | ॥సొరిది॥ |
| దేహములు దలఁప సుస్థిరములా ప్రాణులకు నూహింప లోభ మట్లుండుఁ గాక మోహంబుచే వెనకముందెఱుఁగలేక తమ దేహసుఖములు మరిగి తిరిగేరు గాక | ॥సొరిది॥ |
| నెలకొన్న ద్రవ్యములు నిలుచునా యెవ్వరికి అలవి నిలుపఁగరాని యాస గాక బలువైన వట్టి విభ్రాంతిచే దగులువడి తెలిసియునుఁ దెలియ కిటు తిరిగేరు గాక | ॥సొరిది॥ |
| నెఱయు విభవములెల్ల నిజములా యిందరికి కొఱమాలినట్టి తమగుణము గాక యెఱుకతోఁ దిరువేంకటేశుఁ గొలువఁగలేక తెఱఁగుమాలిన బుద్ధిఁ దిరిగేరు గాక | ॥సొరిది॥ |


