Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 41-1
సంపుటము: 1-249
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కాక మరి యింతేల కలుగుఁ దమకే తమకు
చేకొన్న కోరికలు చేరునందాఁకా
॥కాక॥
దొరతనములన్నియును దొరసినందాఁకా
నెరతనములన్నియును నెరపినందాఁకా
గరగరికలన్నియును కలసినందాఁకా
విరసంబులన్నియును విసుగునందాఁకా
॥కాక॥
యెడమాటలన్నియును యెనసినందాఁకా
అడియాస కోరికలు అదుకునందాఁకా
జడిగొన్న గుక్కిళ్లు చవిగొన్నయందాఁక
వొడ లోముటలు మోహ ముడుగునందాఁకా
॥కాక॥
యీవెల్లఁ దమయాత్మ యిచ్చగించినందాఁక
శ్రీవేంకటేశు కృప చేరునందాఁక
లోవెలుతులన్నియును లోఁగొన్నయందాఁక
వేవేగ బంధములు వీడునందాఁకా
॥కాక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము