అధ్యాత్మ సంకీర్తన
రేకు: 41-4
సంపుటము: 1-252
రేకు: 41-4
సంపుటము: 1-252
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇతరులకు నిను నెఱఁగఁ దరమా సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితు లెఱుగుఁదురు నిను నిందిరారమణా | ॥ఇతరుల॥ |
| నారీకటాక్ష పటునారాచభయరహిత- శూరు లెఱుఁగుదురు నినుఁ జూచేటి చూపు ఘోరసంసారసంకులపరిచ్ఛేదులగు ధీరు లెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము | ॥ఇతరుల॥ |
| రాగభోగవిదూరరంజితాత్ములు మహా- భాగు లెఱుఁగుదురు నినుఁ బ్రణుతించు విధము ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- యోగు లెఱుఁగుదురు నీవుండేటి వునికి | ॥ఇతరుల॥ |
| పరమభాగవతపదపద్మసేవానిజా- భరణు లెఱుఁగుదురు నీ పలికేటి పలుకు పరగు నిత్యానందపరిపూర్ణ మానస- స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ | ॥ఇతరుల॥ |


