అధ్యాత్మ సంకీర్తన
రేకు: 41-5
సంపుటము: 1-253
రేకు: 41-5
సంపుటము: 1-253
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఎరుఁగుదు రిందరు నెఱిఁగీ నెఱఁగరు హరి దానే నిజపరమాతుమని | ॥ఎరుఁగుదు॥ |
| నలినాసనుఁ డెఱుఁగు నారదుఁ డెఱుఁగు కొలఁది శివుఁ డెఱుఁగు గుహుఁ డెఱుఁగు యిల గపిలుఁ డెఱుఁగు నింతా మను వెఱుఁగు తలఁప విష్ణుఁడే పరతత్వమని | ॥ఎరుఁగుదు॥ |
| బెరసి [1]ప్రహ్లాదుఁడు భీష్ముఁడు జనకుఁడు గురుతుక బలియు శుకుఁడుఁ గాలుఁడు వరుస నెఱుఁగుదురు వడి రహస్యముగ హరి యితఁడే పరమాత్ముఁడని | ॥ఎరుఁగుదు॥ |
| తెలియదగిన దిది తెలియరాని దిది తెలిసినాను మదిఁ దెలియ దిది యిల నిందరుఁ దెలిసి రిదే పరమమని కలవెల్లఁ దెలిసె వేంకటరాయుఁడు | ॥ఎరుఁగుదు॥ |
[1] ‘ప్రంహ్లాదుఁడు’ రేకు.


