అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-1
సంపుటము: 1-261
రేకు: 43-1
సంపుటము: 1-261
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| ఆదిమునుల సిద్ధాంజనము యే దెసఁ జూచిన నిదివో వీఁడే | ॥ఆది॥ |
| నగిన సెలవిఁ బడు నాలుగు జగములు మొగమునఁ జూపే మోహనము నిగిడి యశోదకు నిధానంబై పొగడొందీ గృహమున నిదె వీఁడే | ॥ఆది॥ |
| కనుదెరచిన నలుగడ నమృతము లటు అనువునఁ గురసీ నపారము వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ మనికికి నిరవై మలసీ వీఁడే | ॥ఆది॥ |
| పరమునకునుఁ దాఁ బరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుఁడు సరుస రుక్మిణికి సత్యభామకును వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే | ॥ఆది॥ |


