Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-3
సంపుటము: 1-263
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
మోహము విడుచుటే మోక్షమది
దేహ మెఱుఁగుటే తెలివీ నదే
॥మోహము॥
ననిచిన తన జన్మముఁ గర్మముఁ దన
పనియు నెఱుగుటే పరమ మది
తనకు విధినిషేధములుఁ బుణ్యముల
ఘనత యెఱుగుటే కలిమి యది
॥మోహము॥
తఱిఁ దఱిఁ బ్రేమపు తల్లిదండ్రులను
యెఱఁగనిదే కులహీన తది
చఱులఁ బొరలి యాచారధర్మములు
మఱచినదే తన మలిన మది
॥మోహము॥
కమ్మరఁ గమ్మరఁ గామభోగములు
నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయుని దాసుల
సొమ్మయి నిలుచుట సుకృత మది
॥మోహము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము