Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-6
సంపుటము: 1-266
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఆపన్నులపాలి దైవమాతఁడే [1]గతిఁ దక్క
యే ప్రొద్దును భజియించఁగ నితరుఁడు మరి [2]కలఁడా
॥ఆపన్నుల॥
నిరుపాధిక నిజబంధుఁడు నిరతిశయానందుఁడు
కరివరదుఁ డితఁడే గాక ఘనుఁ డధికుఁడు గలఁడా
॥ఆపన్నుల॥
సంతతగుణసంపన్నుఁడు సాధులకుఁ బ్రసన్నుఁడు
అంతర్యా మితఁడే కాక అధికుఁడు మరి కలఁడా
॥ఆపన్నుల॥
పరమాత్ముఁడు పరమపురుషుఁడు పరికింపఁగఁ గృపాలుఁడు
తిరువేంకటవిభుఁడే కాక దేవుఁడు మరి కలఁడా
॥ఆపన్నుల॥

[1] ‘మతిఁదక్క’ రేకు. ‘గతిదక్క’ ఉండవచ్చు.

[2] ‘కలఁడ’ అనియే అంతటా పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము