అధ్యాత్మ సంకీర్తన
రేకు: 44-1
సంపుటము: 1-268
రేకు: 44-1
సంపుటము: 1-268
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము మోదమెరంగని మోహము ముందర గననీదు | ॥ఈ దేహ॥ |
| నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు సత్యాలాపవిచారము జరగదు లోభికిని హత్యావిరహితకర్మము అంటదు క్రూరాత్మునకును ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు | ॥ఈ దేహ॥ |
| సతతానందవికాసము సంధించదు తామసునకు గతకల్మషభావము దొరకదు వ్యసనికిని జితకాముఁడు దా నవుటకు సిద్ధింపదు దుష్కర్మికి అతులితగంభీరగుణం బలవడ దధమునకు | ॥ఈ దేహ॥ |
| శ్రీవేంకటగిరివల్లభు సేవాతాత్పరభావము [1]ద్రోవ మహాలంపటులకు తోఁపదు తలఁపునకు దేవోత్తముఁడగు నీతని దివ్యామృతమగు నామము సేవింపఁగ నితరులకును చిత్తం బొడఁబడదు | ॥ఈ దేహ॥ |
[1] ద్రోవ = తత్పరమార్గము అని అర్థము కావచ్చు.


