Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 44-3
సంపుటము: 1-270
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
నీ మహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి
కామింప నిట్టిదని కానరా దటుగాన
॥నీ మహత్త్వ॥
నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి-
నుండుదువుగాని నీ వొకటియునుఁ గావు
దండిగల గిరి ప్రతిధ్వని దోచుఁగాని యది
కొండలోపల లేదు కొండయునుఁ గాదు
॥నీ మహత్త్వ॥
బలసి యిన్నిటి లోపలనుఁ జైతన్యమై
మెలఁగుదువుగాని యేమిట నీవు లేవు
పలుదెరగులైన దర్పణమునందొక నీడ
వొలయుఁ గాకందు దలపోయ నది లేదు
॥నీ మహత్త్వ॥
వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ-
వుడివోయి యందుండకుండుటయు లేదు
చెడని తేజముగాన శ్రీవేంకటేశ నీ-
పొడవు పరిపూర్ణమై పొలుపొందుఁగాన
॥నీ మహత్త్వ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము