Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 44-4
సంపుటము: 1-271
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
అది నా యపరాధమిది నా యపరాధ-
మదియు నిదియు నా యపరాధము
॥అది॥
నెరయ రూపములెల్ల నీరూపమేకా
నరయని యది నా యపరాధము
పరిపూర్ణుఁడగు నిన్నుఁ బరిచ్ఛిన్నునిఁగా-
నరయుట యది నా యపరాధము
॥అది॥
జీవాత్మునిఁగాఁ జింతింపఁ దలఁచుట
యావంక నది నా యపరాధము
సేవించి నిను నాత్మఁ జింతింపకుండుట
ఆవల నిది నా యపరాధము
॥అది॥
యీడెరఁగక వేంకటేశుఁడ నినుఁ గొని-
యాడుట యది నా యపరాధము
యేడఁ జూచిన నా యెదుర నుండఁగ నిన్ను
నాడ నీడ వెదకు టపరాధము
॥అది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము