అధ్యాత్మ సంకీర్తన
రేకు: 44-5
సంపుటము: 1-272
రేకు: 44-5
సంపుటము: 1-272
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| సతతవిరక్తుఁడు సంసారి గాఁడు రతిసమ్మదుఁడు విరక్తుఁడు నితఁడె | ॥సతత॥ |
| నిత్యుఁడైనవాఁడు నిఖిలలోకములఁ- బ్రత్యక్షవిభవసంపన్నుఁడు గాఁడు నిత్యుఁడు నితఁడే నిరుపమానుఁడైన ప్రత్యక్షవిభవసంపన్నుఁ డితఁడె | ॥సతత॥ |
| యోగియైనవాఁడు వొనర నేకాలము భోగియై భోగిపై భోగింపలేఁడు యోగియు నితఁడే వుడుగక భోగిపై [1]భోగించునటువంటి పురుషుండు నితఁడె | ॥సతత॥ |
| దేవుడైనవాఁడుఁ దెలుప లోకముల దేవతారాధ్యుఁడై దీపింపలేఁడు దేవుఁడు నితఁడే దివిజవంద్యుఁడైన శ్రీవేంకటగిరిదేవుండితఁడె | ॥సతత॥ |
[1] ‘భోగించి’ రేకు.


