అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-1
సంపుటము: 1-273
రేకు: 45-1
సంపుటము: 1-273
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని - మచ్చిక పెనుఁదెవులు మానకపోయె | ॥ఎచ్చోటి॥ |
| పాయపు సతుల గుబ్బల పెదపొట్లాల కాయము వడి నొత్తి కాఁచఁగను రాయిడిచే ఘనమాయఁగాని లోని- మాయపు పెనుఁదెవులు మానకపోయె | ॥ఎచ్చోటి॥ |
| అతివల మోహపు టధరామృతములు యితవుగ నోరి కందియ్యఁగను అతిమోహమే ఘనమాయఁగాని లోని- మతకరి పెనుఁదెవులు మానకపోయె | ॥ఎచ్చోటి॥ |
| తరుణుల మేని మెత్తనిపరపులమీఁద నిరవుగ నిటు సుఖియించఁగను తిరువేంకటాచలాధీశు కృపచేఁగాని మరుచేతి పెనుఁదెవులు మానకపోయె | ॥ఎచ్చోటి॥ |


