అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-2
సంపుటము: 1-274
రేకు: 45-2
సంపుటము: 1-274
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| పండియుఁ బండదు చిత్తము పరిభవ యెడయదు కాంక్షల యెండలనే కాఁగితి మిఁక నేలాగో కాని | ॥పండియు॥ |
| పదిగోట్లు జన్మంబులఁ బాయని కర్మపుఁ బాట్లు వదలక వొక [1]నిమిషములో వడిఁదీరుచు నితఁడు చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతక[2] హృదయము నిలువదు [3]చంచల మేలాగోకాని | ॥పండియు॥ |
| [4]కూపపు బహునరకంబుల కోట్లసంఖ్యలఁ బొరలేటి పాపము లొకనిమిషములోఁ బాపఁగఁ గలఁ డితఁడు కాపాడఁగఁ దలచిన [5]యీ కమలాపతి, నే మీతని- యేపునఁ గని మనలేమిఁక నేలాగోకాని | ॥పండియు॥ |
| జడిగొని యెన్నఁడు బాయని సంసారపు బంధంబుల విడుమని వొకనిమిషములో విడిపించును యితఁడు కడుఁ గొలిచినవారికి వేంకటపతి, నే మీతని- నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని | ॥పండియు॥ |
[1] ‘విషయములో’ పూ.ము.పా.
[2] అంతక = అంతవరకు కావచ్చు.
[3] ‘చెంచెల’ రేకు.
[4] ‘బహునరకకూపంబులకోట్లు’ అనుట సహజము. ఈ వింతసమాసములు ఈ వాఙ్మయమున గలవు.
[5] ‘యాకమలా’ పూ.ము.పా.


