అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-3
సంపుటము: 1-275
రేకు: 45-3
సంపుటము: 1-275
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో[1] నీడనుండి చీరలమ్మే నేఁతబేహారి | ॥వాడల॥ |
| పంచభూతములనెడి పలువన్నె నూలు చంచలపుగంజి వోసి చరిసేసి కొంచెపు కండెల నూలి గుణముల నేసి మంచిమంచి చీరలమ్మే మారుబేహారి | ॥వాడల॥ |
| మటుమాయములఁ దన మగువ పసిఁడినీరు చిటిపొటి యలుకలఁ జిలికించఁగా కుటిలంపుఁ జేఁతలు కుచ్చులుగాఁ గట్టి పటవాళి చీరలమ్మే బలుబేహారి | ॥వాడల॥ |
| మచ్చిక కర్మమనేటి మైల సంతలలోన వెచ్చపు కర్మధనము [2]వెలువచేసి పచ్చడాలుగాఁ గుట్టి బలువేంకటపతి ఇచ్చకొలఁదుల నమ్మే ఇంటిబేహారి | ॥వాడల॥ |
[1] ‘డెవో’ పూ.ము.పా. ‘వాడు + ఇగో’కు వ్యావహారికము. ఇట్టివి ఈవాఙ్మయమున గలవు. చూ. 279 పాట.
[2] ‘విలువ’ పూ.ము.పా.


