Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-4
సంపుటము: 1-276
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
తొక్కనిచోట్లు దొక్కెడి మనసు
యెక్కడ గతిలే దింకనో[1] తెరువు
॥తొక్కని॥
పాపము వాయదు పై పై మనసున
కోపము దీరదు కొంతైనా
దీపన బాధయుఁ దీర దిన్నియును
యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు
॥తొక్కని॥
[2]యెవ్వనమదమును నెడయదు కోరికె
కొవ్వును నణఁగదు కొంతైనా
రవ్వగు మమకారముఁ బెడఁబాయదు
యెవ్విధియును లేదింకనో తెరువు
॥తొక్కని॥
వెఱపును విడువదు వెడమాయలఁ బడి
కొఱఁతయుఁ దీరదు కొంతైనా
తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి -
నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు
॥తొక్కని॥

[1] ‘ఓ తెరువు’ సంబోధనమా? ‘తెరువా’ కావలె. ఇంకనో తెరువు = ఇంకానా మనకు త్రోవ? అని కావచ్చు.

[2] ‘యవ్వన’ పూ.ము.పా. యతిభంగము. ‘యెడయ’లోని యకారమునకు గూర్చిరేమో?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము