Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-6
సంపుటము: 1-278
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
అన్నిచోట్లఁ పరమాత్మ నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా
॥అన్ని॥
పాలజలనిధినుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యల రూపై విచ్చేతుగా
॥అన్ని॥
వుత్తర మధురలో నయోధ్యలోపల నుండి
సత్తైన నందవ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి
వత్తుగా లోకములు పావనము సేయఁగను
॥అన్ని॥
కైవల్యమున నుండి కమలజలోకాన
మోవఁగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము