Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 45-6
సంపుటము: 1-279
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
మాయపు దనుజుల మదవైరి కపి-
రాయఁడు [1]వీఁడివో రాముని బంటు
॥మాయపు॥
పెట్టిన జంగయు పెంపుమిగుల మొలఁ
గట్టిన కాసెయు గర్వమున
నిట్టనిలిచి పూనినచేత నడిమి-
దిట్ట వీఁడువో దేవుని బంటు
॥మాయపు॥
నవ్వుచు లంకానగరపు దనుజుల-
కొవ్వణఁచిన కపికుంజరుఁడు
మువ్వురువేల్పుల మొదలి భూతియగు-
రవ్వగు సీతారమణుని బంటు
॥మాయపు॥
పంకజసంభవు పట్టముగట్టను
వుంకించిన తన వొడయనిచే
పొంకపు కలశాపుర హనుమంతుఁడు
వేంకటరమణుని వేడుక బంటు
॥మాయపు॥

[1] ‘వీఁడెవో’ పూ.ము.పా. చూ. 275 పాట.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము