Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 46-1
సంపుటము: 1-280
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
పరుసము సోఁకియు బ్రదుకవద్దా
తిరిగి కర్మము లింక తీదీపులా
॥పరుసము॥
పడిగాలు వడియున్న ప్రాణచారముల-
పడఁతుల నధములఁ బాలించితి
యిడుమలఁ బెడఁబాప నింకనేల తెగి కొంక
[1]గడిచీటిచ్చియు నింకఁ గడ మున్నదా
॥పరుసము॥
మితిలేని ధనములు మెరసి కానుకగొని
అతిపుణ్యు లిందరి నలరించితి
ధృతిహీనులకు నెల్ల దిక్కయి కాతువుగాక
వ్రతముచెల్లిన నింక వట్టఁ గట్లా
॥పరుసము॥
పాలించి నావిన్నపమున వేంకటరాయ
లాలించితివి నే నీలలనఁగానా
యీలాగుననె లోకమింతాఁ గాతువుగాక
పాలు దాగినమీఁదఁ బైకుడుపులా
॥పరుసము॥

[1] ‘గడియించి తెచ్చియు’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము