అధ్యాత్మ సంకీర్తన
రేకు: 46-3
సంపుటము: 1-282
రేకు: 46-3
సంపుటము: 1-282
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో సంతపాకలంజఁ దెచ్చి సన్యాసిఁ జేసె | ॥ఇంత॥ |
| పరిగె లేరేటివానిఁ బట్టపురాజుఁగా నిరతభోగము లిచ్చి నిలిపినట్లు ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు అరయ నిత్తడిఁ దెచ్చి యపరంజిఁ జేసె | ॥ఇంత॥ |
| కుక్కల వండుకతినే కులహీనునిఁ దెచ్చి వెక్కసపుఁ బాఁపనిఁ గావించినయట్లు దిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చి గక్కనఁ దెలుకపిండి కస్తూరి సేసె | ॥ఇంత॥ |
| చెడుగైన దోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగా బెడిదంపుఁ బ్రేమతోడఁ బెంచినయట్లు కడు నధముని వేంకటపతి నను నిటు చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె | ॥ఇంత॥ |


