అధ్యాత్మ సంకీర్తన
రేకు: 46-5
సంపుటము: 1-284
రేకు: 46-5
సంపుటము: 1-284
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఎన్ని బాధలఁ బెట్టి యేఁచెదవు నీవింక నెంతకాలముదాఁకఁ గర్మమా మన్నించుమనుచు నీ మఱఁగు జొచ్చితిమి మా మాటాలకించ వోకర్మమా | ॥ఎన్ని॥ |
| ప్రతిలేని దురితములపాలు సేయక నన్నుఁ బాలించవైతి వోకర్మమా తతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల సేసి తోకర్మమా జితకాములకుఁగాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమా మతిహీనులైనట్టి మాకు నొకపరిపాటిమార్గంబు చూప వోకర్మమా | ॥ఎన్ని॥ |
| ఆసలనియెడి తాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకు వోకర్మమా కాసుకునుఁ గొరగాని గతిలేని పనికిఁగా కాలూఁదనీవేల కర్మమా [1]వోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలఁగుమీ కర్మమా | ॥ఎన్ని॥ |
| తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసలఁ దిరిగినయట్టి కర్మమా హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేనుగమీఁదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్లఁ గర్మమా పరమపురుషోత్తముని భ్రమతఁ బడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా | ॥ఎన్ని॥ |
[1] ఓసరించి + ఒకమారు.


