Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 46-6
సంపుటము: 1-285
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
ఇన్ని సేఁతలకు నిది యొకటే
కన్నా మనసిది కానదు గాని
॥ఇన్ని॥
పాతకకోట్లు భవములు భస్మీ-
భూతము సేయఁగఁ బొడవొకటే
శ్రీతరుణీపతి చింత నిజముగా
యేతరి చిత్తం బెఱఁగదుగాని
॥ఇన్ని॥
మరణభయంబులు మదములు మలినీ-
కరణము సేయఁగఁగల దొకటే
హరినామామృత, మందుమీఁది రతి
నిరతము నా కిది నిలువదుగాని
॥ఇన్ని॥
కుతిలములును దుర్గుణములునుఁ దృణీ -
కృతములు సేయఁగ గురుతొకటే
పతియగు వేంకటపతి సేవారతి,
గతియని మతి గని కానదుగాని
॥ఇన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము