Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-2
సంపుటము: 1-287
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను
తీరని చేఁదే కాక తియ్యనుండీనా
॥భారమైన॥
పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి
చాయ కెంత గట్టిగాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలముఁ జెప్పినా
పోయిన పోకలేకాక బుద్ది వినీనా
॥భారమైన॥
ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
పంచమహాపాతకాలబారిఁ బడ్డ చిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాఁకి వంగీనా
॥భారమైన॥
కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారెఁ గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా
॥భారమైన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము