Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-6
సంపుటము: 1-291
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
దైవమా పరదైవమా
యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో
॥దైవమా॥
పాపకర్మునిఁ దెచ్చి పరమియ్యఁదలఁచిన
మేపులకే పోక మెయికొనీనా
తీపులు రూపులుఁ దివిరి [1]నా వెనువెంట-
నేపొద్దు నీ వేఁడఁ దెచ్చేవో
॥దైవమా॥
అధమాధమునిఁ దెచ్చి యధికుని జేసేనంటే
విధినిషేధములు వివరించునా
నిధినిధానములు నిచ్చనిచ్చలుఁ బెక్కు-
విధముల నెటువటె వెదచల్లెదవో
॥దైవమా॥
అతికష్టుఁడగు నాకు నలవిగాని యీ-
మత మొఁసగిన నేను మరిగేనా
ప్రతిలేని వేంకటపతి నీదు నామా-
మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక
॥దైవమా॥

[1] ‘నావెంట’ పూ.ము.పా. మాత్రాభంగము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము