Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 47-7
సంపుటము: 1-292
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి
ఆ కడ నాఁతడె హరి నెఱిగినవాఁడు
॥ఏ కులజు॥
పరగిన సత్యసంపన్నుఁడైనవాఁడే
పరనింద సేయఁ దత్పరుఁడు గానివాఁడు
అరుదైన భూతదయానిధియగువాఁడే
పరులు దానేయని భావించువాఁడు
॥ఏ కులజు॥
నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే
ధర్మతత్పరబుధ్ధిఁ దగిలినవాఁడు
కర్మమార్గములు గడవనివాఁడే
మర్మమై హరిభక్తి మఱవనివాఁడు
॥ఏ కులజు॥
జగతిపై హితముగాఁ జరియించువాఁడే
పగలేక మతిలోన బ్రతికినవాఁడు
తెగి సకలము నాత్మ దెలిసినవాఁడే
తగిలి వేంకటేశుదాసుఁ డయినవాఁడు
॥ఏ కులజు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము