Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 48-1
సంపుటము: 1-293
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
సేవింతురా యితనిఁ జెలఁగి పరు; లిట్లనే
కావించె మమ్ము నెక్కడి దైవ మితఁడు
॥సేవింతు॥
పాల చవి యితఁడెఱుఁగు పాలఁ బవళించ గో-
పాలుఁడని నే మితని భజియించఁగా
పాలు పడి తల్లి చనుఁబాలు సహితంబు నే-
కాలమునుఁ బాపె నెక్కడి దైవమితఁడు
॥సేవింతు॥
పుట్టింపఁ దానె మఱి పురుషోత్తముఁడు మంచి-
పుట్టు వొసగీననుచుఁ బూజించఁగా
పట్టుకొని మముఁ దెచ్చి బలిమిఁ బుట్టువులెల్లఁ
గట్టిపెట్టించె నెక్కడి దైవమితఁడు
॥సేవింతు॥
కర్మకర్తారుఁడని కడలేని పుణ్యముల
కర్మఫలములు దనకుఁ గైకొలుపఁగా
కర్మగతిఁ దెచ్చి వేంకటవిభుఁడు మా వుభయ-
కర్మములఁ జెరిచె నెక్కడి దైవమితఁడు
॥సేవింతు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము