అధ్యాత్మ సంకీర్తన
రేకు: 48-2
సంపుటము: 1-294
రేకు: 48-2
సంపుటము: 1-294
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| అరిది సేఁతలే చేసి తల్లాడ నిల్లాడ సరిలేక వుండితివి జలరాశికాడ | ॥అరిది॥ |
| పొలియఁ [1]బీర్చితి వొకతిఁ బురిఁటిమంచముకాడ నలఁచితి వొకని గగనంబుకాడ బలిమిఁ దన్నితి వొకని బండిపోతులకాడఁ దులిమితివి యేడుగురఁ [2]దోలి మందకాడ | ॥అరిది॥ |
| తడవి మోదితి వొకని తాటిమాఁకులకాడ నడిచితివి వొకనిఁ బేయలకాడను పిడిచివేసితి వొకని బృందావనముకాడ వొడిసితివి వొకని నావులమందకాడ | ॥అరిది॥ |
| పటపటన దిక్కులు పగుల బగతులఁ దునిమి నటియించితివి మామనగరికాడ కుటిలబహుదైత్యాంతకుఁడవు వేంకటరాయ పుటమెగసితి జగంబులయింటికాడ | ॥అరిది॥ |
[1] ‘దీర్చితి’ పూ.ము.పా. ‘పీల్చు’ ధాతువునలు ‘పీరుచు’ అనియు వ్యవహారము గలదు.
[2] ‘దొలి’ పూ.ము.పా.


