Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 48-3
సంపుటము: 1-295
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
బలువగుఁ దనరూపము చూపెన్
కలదింతయుఁ దనఘన తెఱిఁగించెన్
॥బలువగు॥
[1]పాండవరక్షణపరుఁడై నరునకు
నండనే తెలిపె మహామహిమ
దండి విడిచి తనదయతో నర్జునుఁ-
డుండఁగ మగటిమి నొడఁబడఁ బలికె
॥బలువగు॥
మగుడఁగ కులధర్మములుఁ బుణ్యములు
తెగి పార్థున కుపదేశించెన్
నగుచు నతనితో నానాగతులను
నిగమము నియమము నిజ మెరిఁగించెన్
॥బలువగు॥
వెరపు మిగుల నావిజయుని మనుమని
పరీక్షిత్తుఁ దగఁ బ్రదికించెన్
తిరువేంకటగిరిదేవుఁడు దానై
గరిమల భారతకథ గలిగించెన్
॥బలువగు॥

[1] ‘పాండమరక్షక’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము