అధ్యాత్మ సంకీర్తన
రేకు: 48-4
సంపుటము: 1-296
రేకు: 48-4
సంపుటము: 1-296
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| బలువగు కర్మము లివివో జీవుల ప్రారబ్ధంబులు సంచితంబులును బలిసి తీరవివి పెరుగునేకాని బ్రహ్మల బహుకల్పంబులదాఁక | ॥బలువగు॥ |
| పాయని జన్మంబుల కర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములై యేయెడఁ జూచిన నెదిటికొలుచులై [1]యిచ్చల నిటు భుజియించఁగను కాయపుఁ బెడతటిగండఁడు విధి, దనుఁ గడతేర్చిన తన కడకర్మములు పోయి సంచితంబులఁ గలసిన, నవి పొదలుచుఁ గొండల పొడవై పెరుగు | ॥బలువగు॥ |
| పొదలి సంచితంబులు వడిఁ బెరుగును, పొలియును జీవునిపుణ్యముఁ, జాలక యెదిగిన పుణ్యం బిగురును, కాఁగిన యినుముమీఁది జలములవలెను; పదిలములై కడుఁ బాపకర్మములే బరువై పరగఁగఁ బ్రాణికి నెన్నఁడు తుదయు మొదలు నెందును లేక, వడిఁ దొలఁగక భవములతొడవై తిరుగు | ॥బలువగు॥ |
| [2]తలఁపులో నవయఁదలఁచిన జంతువు, కలుషహరుఁడు వేంకటగిరిపతి దను- దలఁచు భాగ్య మాత్మకు నొసగినఁ, జిత్తము పరిపక్వంబై యెపుడు జలజోదరు దలఁచఁగఁ బ్రారబ్ధంబులు సంచితంబులుఁ బొలిసి పుణ్యులై చెలువగు నిత్యానందపదంబునఁ జెలఁగి సుఖించగఁ జేరుదు రపుడు | ॥బలువగు॥ |
[1] ‘యిచ్చట నిటు భజి’ పూ.ము.పా.
[2] ‘తలఁపులో మనుపఁదలచిన’ కావచ్చు. ‘స్వామి తనమనసులో కాపాడదలచిన ప్రాణిని’ అని అర్థము కావచ్చు.


