అధ్యాత్మ సంకీర్తన
రేకు: 48-4
సంపుటము: 1-297
రేకు: 48-4
సంపుటము: 1-297
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి మాలు గలపి దొరతనంబు మాన్పు టింత చాలదా | ॥చాల॥ |
| పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు కడపరాని బంధములకుఁ గారణంబులైనవి యెడపకున్న పసిఁడిసంకెలేమి యినుపసంకెలేమి మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదు చూడరానివి | ॥చాల॥ |
| చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకు అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు ములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా | ॥చాల॥ |
| కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు కర్మఫలముమీఁద కాంక్ష గలుగు టింత చాలదా మర్మ మెరిఁగి వేంకటేశు మహిమలనుచుఁ దెలిసినట్టి నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా | ॥చాల॥ |


