అధ్యాత్మ సంకీర్తన
రేకు: 49-1
సంపుటము: 1-298
రేకు: 49-1
సంపుటము: 1-298
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| కాలాంతకుఁడను వేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును కాలంబనియెడి తీవ్రపుగాలి వెర వెఱిఁగి | ॥కాలాంతకు॥ |
| పరమపదంబను చేనికి పసిగొను నరమృగములకును తరమిడి, సంసారపుటోఁదములనె యాఁగించి, వురవడిఁ జేసిన కర్మపుటరులు దరిద్రంబను వల వొరపుగ [1]మాయను పోగులు వొకవెరవున వేసీ | ॥కాలాంతకు॥ |
| కదుముక వచ్చేటి బలురోగపుఁ గుక్కల నుసికొలిపి వదలక ముదిసిన ముదిమే వాకట్టుగఁ గట్టి, పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ, పదిలముగా గింకరులను చొప్పరులఁ బరవిడిచీ | ॥కాలాంతకు॥ |
| ఆ వోఁదంబులఁ జిక్కక, ఆ వురులనుఁ దెగనురికి, ఆ వేఁటకాండ్ల నదలిం చాచేనే చొచ్చి, పావనమతిఁ బొరెవొడిచి పరమానందముఁ బొందుచు శ్రీవేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము | ॥కాలాంతకు॥ |
[1] మాయ + అను.


