Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 49-3
సంపుటము: 1-300
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
[1]అయ్యో మానుపఁ గదవయ్య మనుజుఁడు తన-
కయ్యపుఁ గంట గానఁడు
॥అయ్యో॥
పాపపుణ్యలంపటుఁడైనా దుష్ట-
రూపుడూ జన్మరోగి యటుగాన
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి
యేపొద్దు వొడలెరఁగఁడు
॥అయ్యో॥
నరకభవనపరిణతుఁడైనా కర్మ
పురుషుఁడు హేయభోగి యటుగాన
దురితపుణ్యత్రిదోషజ్వరము పట్టి
అరవెరమాట లాడీని
॥అయ్యో॥
దేహమోహసుస్థిరుఁడైనా ని-
ర్వాహుఁడు తర్కవాది యటుగాన
శ్రీహరి వేంకటశ్రీకాంతునిఁ గని
వూహలఁ జేరనొల్లఁడు
॥అయ్యో॥

[1] ఈ పాటలోని భావము సుస్పష్టముగా తోపదు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము