Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 49-4
సంపుటము: 1-301
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
ఏదియును లేని దేఁటిజన్మము
వేదాంతవిద్యావివేకి గావలెను
॥ఏదియును॥
పరమమూర్తిధ్యానపరుఁడు గావలె నొండె
పరమానందసంపద లొందవలెను
పరమార్థముగ నాత్మభావింపవలె నొండె
పరమే తానై పరగుండవలెను
॥ఏదియును॥
వేదశాస్త్రార్థకోవిదుఁడు గావలె నొండె
వేదాంతవిదుల సేవించవలెను
కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె
మోదమున హరిభక్తి మొగి నుండవలెను
॥ఏదియును॥
సతతభూతదయావిచారి గావలె నొండె
జితమైన యింద్రియస్థిరుఁడు గావలెను
అతిశయంబగు వేంకటాద్రీశుసేవకులె
గతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను
॥ఏదియును॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము