అధ్యాత్మ సంకీర్తన
రేకు: 49-5
సంపుటము: 1-302
రేకు: 49-5
సంపుటము: 1-302
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| కడుపెంత తాఁ గుడుచు కుడుపెంత దీనికై పడని పాట్లనెల్లఁ బడి పొరలనేలా | ॥కడుపెంత॥ |
| పరుల మనసునకు నాపదలు గలుగఁగఁ జేయఁ బరితాపకరమైన బ్రదుకేలా సొరిది నితరుల మేలుచూచి సైఁపఁగలేక తిరుగుచుండేటి కష్టదేహ మిదియేలా | ॥కడుపెంత॥ |
| యెదిరి కెప్పుడుఁ జేయు హితమెల్లఁ దనదనుచు చదివి చెప్పనియట్టి చదువేలా పొదిగొన్న యాసలోఁ బుంగుడై సతతంబు సదమదంబై పడయు చవులు దనకేలా | ॥కడుపెంత॥ |
| శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁ గాక జీవనభ్రాంతిఁ బడు సిరులేలా దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు- త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలా | ॥కడుపెంత॥ |


