Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 49-6
సంపుటము: 1-303
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁ గాని
జనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు
॥ఘన॥
ప్రతిలేని ధైర్యంబు పదిలపరచినఁ గాని
మతిలోని పగవారి మద మణఁపరాదు
మితిలేని శాంతమను మేఁటికైదువఁ గాని
[1]క్రితకంబు విషయముల గెలుపెరఁగరాదు
॥ఘన॥
సొరిది నిర్మోహమను జోడు దొడిగినఁ గాని
వెరపుడిగి మమతచే వెళ్లఁబడరాదు
యిరవైన విజ్ఞానపింట నుండినఁ గాని
అరసి జగమెల్ల తానై యేలరాదు
॥ఘన॥
యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁ గాని
తన్నుఁ దానెరిఁగి యాతనిఁ గొలువరాదు
కన్నులను వెలి లోను గలయఁజూచిన గాని
సన్నంబు ఘనమనెడి జాడ గనరాదు
॥ఘన॥

[1] ‘కృతకంబు’నకు వ్యావహారికమా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము