Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 50-1
సంపుటము: 1-304
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఎఱుక గలుగునాఁ డెఱఁగఁడటా
మఱచిన మేనితో మరి యెఱిఁగీనా
॥ఎఱుక॥
పటువైభవములఁ బరగేటినాఁడే
తటుకున శ్రీహరిఁ దలఁచఁడటా
కుటిలదేహియై కుత్తికఁ బ్రాణము
తటతట నదరఁగఁ దలఁచీనా
॥ఎఱుక॥
ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు
తాలిమితో హరిఁ దలఁచఁడటా
వాలిన కాలుని వసమైనప్పుడు
[1]దాలు వెండఁగాఁ దలఁచీనా
॥ఎఱుక॥
కొఱఁతలేక తేఁకువఁ దా నుండేటి-
తఱి వేంకటపతిఁ దలఁచఁడటా
మఱులు దేహియై మఱిచివున్నయడ
తఱచుటూరుపులఁ దలఁచీనా
॥ఎఱుక॥

[1] ‘దాలు(శి?) వేఁడఁగా’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము