అధ్యాత్మ సంకీర్తన
రేకు: 50-2
సంపుటము: 1-305
రేకు: 50-2
సంపుటము: 1-305
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కాలము కాలముగాదు కపటాలే తఱచాయ చాలునింక దీనితోడీ జాలి మానరే | ॥కాలము॥ |
| పిన్ననాటనుండి తన పెంచిన యీదేహము మున్నిటివలెగాదు ముదిసీని యెన్నికదినాలచేత నెప్పు డేడఁ బడునో కన్నవారి చేతికి గక్కున నియ్యరే | ॥కాలము॥ |
| తోలునెముకలచేత దొడ్డైన యాదేహము గాలిచేత దాలిమీఁదఁ గాగీని కీలుగీలు [1]యెప్పు డేడ కింద వీడిపడునో మేలుఁగీడు లేనిచోట మేఁటిఁజేసి పెట్టరే | ॥కాలము॥ |
| కింకపు కిసరుచేత కీడైన దేహము వంకవంక తెరవుల వడీసీని యింక నీవిధిచేత నెప్పు డేడఁ బడునో వేంకటేశుఁ జేరఁ బడవేయఁ గదరే | ॥కాలము॥ |
[1] ‘యిప్పు’ రేకు.


