Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 50-3
సంపుటము: 1-306
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఇటువలెనే పో సకలము యించుకగన భావించిన
అటమటముల సంతోషము ఆసలు సేయుటలు
॥ఇటు॥
పగగొని తిరిగేటి జన్మపుబాధలు తన కేకాలము
తగుసుఖ మెక్కడ నున్నది తడతాఁకులే కాక
పొగలోపల [1]సెక గాసిన భుగభుగఁ గన్నుల నీళ్లు
నిడిగిన దుఃఖమే కాకిటు నిజసౌఖ్యము గలదా
॥ఇటు॥
పొలసిన మాయపురూపులు పొలఁతుల మచ్చికమాటలు
తలఁచిన తనకేమున్నది తలఁపోఁతలేకాక
బలువునఁ బారఁగ మోహపుపాశము తన మెడఁ దగిలిన
తలకిందుగఁ బడుటెల్లను తనకిది ప్రియమౌనా
॥ఇటు॥
చేతిపదార్థము దలఁచక చేరువనుండినవారల
చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా
ఆతుమఁ గల వేంకటపతి నాత్మఁ దలఁచి సుఖింపక
యేతరి సుఖములఁ దిరిగిన నింపులు దనకౌనా
॥ఇటు॥

[1] ‘శక’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము