Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 50-4
సంపుటము: 1-307
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభో(బో)ది
శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి
దమము చాలనియట్టి తగు లిదేమిటికి
॥శమము॥
పగయునుఁ బోలె నాపై సేయు నడియాస
తగిలి యేపనేకాని దయ గొంత లేదు
జగడముఁ బోలె నల సతిలేని మమత దను
తెగి వేఁచనేకాని తీరుగడ లేదు
॥శమము॥
ఋణమునుఁ బోలె తీరియుఁ దీరనది కర్మ
గణనగల కాలంబు కడ మొదలు లేదు
వ్రణమునుఁ బోలె విడవక రాఁగ[1]దేహజపు-
గుణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు
॥శమము॥
నీతియుఁ బోలెఁ బ్రాణికి వేంకటేశు కృప
చేతికి నిధానంబు చేరినట్లాయ
భూతములుఁ బోలె తలఁపున కితరసంస్మరణ-
భీతిపుట్టించి యప్రియభావమాయ
॥శమము॥

[1] ‘రాఁగ’లో అరసున్న విచార్యము. ‘రాఁగు’ కావచ్చు. ‘రాఁగు’లో ఈ వాఙ్మయమున అరసున్న కలదు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము