అధ్యాత్మ సంకీర్తన
రేకు: 61-1
సంపుటము: 1-310
రేకు: 61-1
సంపుటము: 1-310
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఛాయానాట
| తలఁప [1]వెనక నుయ్యి తగరు ముందట(?) దీనఁ దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమి సేతు | ॥తలఁప॥ |
| మమకార(ము?) విముక్తి[1]మార్గదూరము నీపై మమతసేయక నాకు మనరాదు మమత మేలో నిర్మమత మేలో దీని క్రమము నక్రమము నేఁ గాన నేమి సేతు | ॥తలఁప॥ |
| కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని- ష్కర్మము పాతకమునకుఁ దొడవు కర్మి గావలెనో నిష్కర్మి గావలెనో యీ- మర్మంపు [3]మదము మాన దేమి సేతు | ॥తలఁప॥ |
| శరణాగతరక్షకుడవైనయట్టి తిరువేంకటగిరిదేవుఁడా పరిపూర్ణుఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో ని- న్నరసి భజింపలేనైతి నేమి సేతు | ॥తలఁప॥ |
[1] ‘వెనకనుయ్యి ముందర గొయ్యి’ అని యీనాటి వాడుక. అన్నమయ్యకు ‘వెనుక నుయ్యి ముందు కొండ’ అను నలవాటు. ఇక్కడ ముందట ‘తగరు’ వచ్చినది.
[2] మార్గ ‘సహజమార్గము’ కావచ్చు.
[3] “మదము = అజ్ఞానము” అని ఉపచారార్థమున ప్రయోగము కావచ్చు.


