అధ్యాత్మ సంకీర్తన
రేకు: 61-2
సంపుటము: 1-311
రేకు: 61-2
సంపుటము: 1-311
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ- పాలిటి దైవమని బ్రహ్మాదులు | ॥పాల॥ |
| రోలఁ గట్టించుక పెద్ద[1]రోలలుగా వాపోవు బాలునిముందర వచ్చి పాడేరు ఆలకించి వినుమని యంబరభాగమునందు నాలుగుదిక్కులనుండి నారదాదులు | ॥పాల॥ |
| నోరునిండా జోల్లుగార నూఁగి [2]ధూళిమేనితో పారేటి బిడ్డనివద్దఁ బాడేరు వేరులేని వేదములు వెంటవెంటఁ జదువుచుఁ[3] జేరిచేరి యింతనంత శేషాదులు | ॥పాల॥ |
| ముద్దులు మోమునఁ గార మూలల మూలల దాఁగే బద్దుల బాలునివద్దఁ బాడేరు అద్దివో శ్రీతిరువేంకటాద్రీశుఁ డితఁడని చద్దికి వేఁడికి వచ్చి సనకాదులు | ॥పాల॥ |
[1] ‘రొదలు’ కావచ్చు.
[2] (నిడురేకు 48) నోర జొల్లుగారఁగను నూఁగు ధూళి వినుతి.
[3] (నిడురేకు 48) సేయుచునుండ.


